manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 10:27 pm Editor : Editor Vishal Kumar

ఉచిత వైద్య శిబిరం..

డెంగ్యూ నియంత్రణకు విస్తృత చర్యలు.. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, పీవో ఎన్‌సీవీ బిడిసీపీ డాక్టర్ సందీప్ పరిశీలించారు. గ్రామ సర్పంచ్ నరహరి వెంకట్‌రెడ్డి కూడా శిబిరాన్ని సందర్శించారు.

గ్రామంలో నమోదైన డెంగ్యూ కేసును దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డెంగ్యూ బాధితురాలి ఇంటిని వైద్య బృందం సందర్శించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఇంటి పరిసరాలను తనిఖీ చేసి దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న పరిస్థితులను గుర్తించారు.

కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల సుమారు 60 ఇళ్ల పరిధిలో పైరిత్రం పిచికారీ, ఏఎల్‌ఓ వినియోగం, లార్వా నియంత్రణ చర్యలు చేపట్టారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి దోమల లార్వా పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని తెలిపారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన రక్త నమూనాలను సేకరించారు. డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

గ్రామస్థాయిలో జ్వర సర్వేలు, రక్త నమూనాల సేకరణ, వైద్య పరీక్షలు, లార్వా నియంత్రణ, దోమల నివారణ చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలని ప్రజలకు సూచించారు.

కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ యాస్మిని, సీహెచ్‌ఓ రాజేంద్రప్రసాద్, సూపర్‌వైజర్ సునీత, ఏఎంఓ సుధాకర్, ఎస్‌యూఓ రమేష్, హెల్త్ అసిస్టెంట్లు పరమేశ్వర్, గోపి, సతీష్, బిక్షపతి, ఏఎన్‌ఎంలు పర్వీన్, భాను, సులోచన, వైద్య ఆరోగ్యశాఖ, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.