manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 11:12 pm Editor : Editor Vishal Kumar

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన జీవనం

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మేదరమెట్ల అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ‘మన అంగన్వాడీ – మన బాధ్యత’ అనే థీమ్‌తో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుణాదేవి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గర్భధారణ నుంచి శిశువు పుట్టిన తర్వాత మొదటి 1000 రోజులు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ కాలంలో తల్లి, బిడ్డకు తగిన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పునాది పడుతుందని వివరించారు. గర్భిణులు, బాలింతలు తమ రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

అన్నంతో పాటు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, చేపలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయని, చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని వివరించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరమని పేర్కొన్నారు.

పిల్లలకు అధికంగా జంక్‌ఫుడ్‌ ఇవ్వకూడదని సూపర్‌వైజర్ సూచించారు. భోజనం చేసే సమయంలో సెల్‌ఫోన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు చూపిస్తూ తినిపించే అలవాటును తల్లిదండ్రులు మానుకోవాలని అన్నారు. పిల్లలు ఆహారాన్ని ప్రశాంతంగా తీసుకునేలా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందిస్తున్న భోజనం, ఆహార మెనూ, పోషకాహార ప్రాధాన్యత గురించి కూడా కార్యక్రమంలో వివరించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శారద, అంగన్వాడీ టీచర్లు రాణి, పద్మకుమారి, ఆయాలు, లబ్ధిదారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.