manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:38 am Editor : Editor Vishal Kumar

పొలాల్లో గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం..

పొలాల్లో గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం: రూ.38.50 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం, ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
మన భారత్, ఆదిలాబాద్: సెప్టెంబరు 18,
ఆదిలాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టంలొద్ది గ్రామ శివారులో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా సాగు చేస్తున్న రూ. 38.50 లక్షల విలువైన 385 గంజాయి మొక్కలను పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ సాగుకు పాల్పడుతున్న ఇద్దరు రైతులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేలాదించారు
రెండు వేర్వేరు పొలాలపై దాడులు
నమ్మదగిన సమాచారంతో పోలీసులు గురువారం పొట్టంలొద్ది గ్రామ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయి సాగును గుర్తించి, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) చేత అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించిన అనంతరం వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

మొదటి ఘటన: పొట్టంలొద్ది గ్రామానికి చెందిన మెస్రం గంగారాం పటేల్ తన వ్యవసాయ పొలంలో అంతర పంటగా సాగు చేస్తున్న రూ. 31.50 లక్షల విలువైన 315 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి జప్తు చేశారు.
రెండో ఘటన: అదే గ్రామానికి చెందిన మెస్రం నాగు అనే రైతు పొలంలో సాగు చేస్తున్న రూ. 7 లక్షల విలువైన 70 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల దాడుల సమయంలో నిందితులు ఇద్దరూ సంఘటనా స్థలంలో లేకపోవడంతో వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ పథకాలు కట్: ఎస్పీ తీవ్ర హెచ్చరిక
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గంజాయిని పండించినా, రవాణా చేసినా, విక్రయించినా, చివరకు సేవించినా చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగుకు పాల్పడే రైతులకు ప్రభుత్వం నుండి అందే ఎలాంటి సంక్షేమ, ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 250 ఎకరాల వ్యవసాయ భూములలో గంజాయి పండించిన రైతులకు ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
సమాచారం ఇస్తే నగదు బహుమతి – వివరాలు గోప్యత
యువత గంజాయి వ్యసనానికి గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు. ఎవరైనా వ్యసనాలకు బానిసలైతే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందిస్తే, వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు పంపి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
సమాజంలో గంజాయి రవాణా లేదా సాగుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నేరుగా ఎస్పీ గారి అధికారిక వాట్సాప్ నెంబర్ 8712659973 కు పంపవచ్చని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, వారికి తగిన నగదు బహుమతులు, రివార్డులు అందించి సత్కరిస్తామని ప్రకటించారు.
ఈ దాడులలో మరియు పత్రికా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.