manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 11:25 pm Editor : manabharath

పంట రక్షణ పేరుతో ప్రమాదకర విద్యుత్ తీగలు.. కఠిన చర్యలు

విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి.. పొలం యజమానిపై హత్య నేరంతో సమానమైన కఠిన సెక్షన్ల కింద కేసు

మన భారత్, ఇచ్చోడ: సెప్టెంబర్ 15 ,పంటలను జంతువుల నుంచి రక్షించుకునేందుకు అక్రమంగా ప్రమాదకర విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ హెచ్చరించారు. పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి చెందిన ఘటనలో పొలం కౌలుదారుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

బ్రిడ్జిని ఢీకొట్టిన లారీ

పోలీసుల వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ నేరడిగొండ మండలం కుప్టి వద్ద మరమ్మతుల్లో ఉన్న బ్రిడ్జిని గమనించకుండా అతివేగంగా వెళ్లి అక్కడ నిలిపి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బ్రిడ్జి మరమ్మతు పనులు చేస్తున్న పలువురు కార్మికులు అక్కడ నిద్రిస్తున్నారు.

లారీ వేగంగా వస్తున్న విషయాన్ని గమనించిన కార్మికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు మరణించి ఉండొచ్చనే భయంతో లారీ డ్రైవర్ అవదేశ్, క్లీనర్ రూపేష్ లారీని అక్కడే వదిలి పరారయ్యారు.

ప్రమాదకర విద్యుత్ తీగకు బలి

లారీ నుంచి తప్పించుకుని వెళ్తున్న క్రమంలో నేరడిగొండ మండలం గాంధారి గ్రామ శివారుకు చేరుకున్న క్లీనర్ రూపేష్ కుమార్ (21) ప్రమాదకర విద్యుత్ తీగను తాకినట్లు పోలీసులు తెలిపారు. ఆత్రం చంద్రబాన్ కౌలుకు తీసుకున్న మొక్కజొన్న పంటకు రక్షణగా అక్రమంగా విద్యుత్ తీగను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఆ తీగ తగలడంతో బీహార్‌కు చెందిన లారీ క్లీనర్ రూపేష్ కుమార్, తండ్రి గణేష్ యాదవ్, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రమాదకర విద్యుత్ తీగల ఏర్పాటు ఎంతటి ప్రాణహానికి దారితీస్తుందో మరోసారి స్పష్టమైంది.

పొలం కౌలుదారుడిపై కేసు

ఈ ఘటనపై నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంటకు రక్షణ పేరుతో అక్రమంగా ప్రమాదకర విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన ఆత్రం చంద్రబాన్ (41), తండ్రి చిత్రు, గాంధారి గ్రామం, నేరడిగొండ మండలం పై హత్య నేరంతో సమానమైన కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ తెలిపారు.

అలాగే లారీని అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అవుతేష్ కుమార్ యాదవ్ (21)పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

‘ప్రాణం కంటే పంట ముఖ్యం కాదు’

పంటలను జంతువుల నుంచి కాపాడుకునేందుకు పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని సీఐ రమేష్ పేర్కొన్నారు. ఇలాంటి తీగలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పొలాల్లోకి వెళ్లే రైతులు, కూలీలు, పశువులు, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతాయని తెలిపారు.

“ప్రాణం కంటే పంట ముఖ్యం కాదు” అని స్పష్టం చేసిన సీఐ.. ఎవరూ పంట రక్షణ పేరుతో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. జిల్లాలో గతంలోనూ అక్రమ విద్యుత్ తీగల కారణంగా ప్రాణనష్టం జరిగిన ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.

సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన ప్రజలు నిర్భయంగా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా విద్యుత్‌ను వినియోగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కేసు దర్యాప్తులో నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.