manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:37 pm Editor : manabharath

పూజల పేరుతో భయపెట్టి డబ్బుల వసూలు.. భార్యాభర్తల అరెస్ట్

బ్లాక్ మ్యాజిక్ పేరుతో ప్రాణహాని భయం.. పూజా సామగ్రి కోసం రూ.81,600 వసూలు

మన భారత్, సెప్టెంబర్ 15, ఆదిలాబాద్: పూజలతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ పేరుతో కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు.

పూజల పేరుతో నమ్మించి..

ఆదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సలీం సయ్యద్ పూజల ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించాడు. అనంతరం బాధితుడి ఇంటి వద్ద పూజలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత పూజలకు అవసరమంటూ బంగారం, వెండి కొనుగోలు చేయించిన నిందితుడు.. మరికొన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి బాధితుడిని యవత్మాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో బాధితుడి నుంచి రూ.81,600 చెల్లింపజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరో రూ.1.32 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులు

ఇంతటితో వ్యవహారం ఆగకుండా మరో రూ.1.32 లక్షలు అవసరమని నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పూజలు నిర్వహించకపోతే బ్లాక్ మ్యాజిక్ తొలగదని, కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని భయపెట్టినట్లు పేర్కొన్నారు.

నిందితుల మాటతీరుపై అనుమానం కలిగిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మావల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మూఢనమ్మకాలపై అప్రమత్తంగా ఉండాలి

మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు. కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలకు పూజలు, మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్బ పేరుతో పరిష్కారం చూపుతామని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని హెచ్చరించారు.

ఎవరైనా ఇలాంటి విధంగా భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసినా, మోసం చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు చట్టపరమైన మార్గాలను అనుసరించాలని, మూఢనమ్మకాలకు లోనై మోసపోవద్దని సూచించారు.

అరెస్టైన నిందితులు

A1) సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్ (40), తండ్రి బషీర్, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర.

A2) సయ్యద్ షమా (46), భర్త సలీం, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర.

మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసే ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు.

ఈ కేసు దర్యాప్తులో మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి