manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 4:12 am Editor : manabharath

సహజసిద్ధమైన నూనెలతో ఆరోగ్యం: కలెక్టర్ రాజర్షి షా

సహజసిద్ధమైన నూనెలకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, తలమడుగు: పురాతన పద్ధతులను పరిరక్షిస్తూ ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా సహజసిద్ధంగా స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెను తయారు చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే నూనెలకు ప్రస్తుత కాలంలో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు.

శుక్రవారం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో తోట రాణి శ్రీధర్ నిర్వహిస్తున్న నిధి నేచురల్ ఫామింగ్ (ఎద్దు గానుగ) యూనిట్‌ను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ సందర్భంగా ఎద్దుల సహాయంతో నిర్వహిస్తున్న నూనె ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించి, నూనె తయారీ విధానం, వినియోగిస్తున్న ముడి పదార్థాలు, ప్రాసెసింగ్ ప్రక్రియ తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి కెమికల్స్ కలపకుండా సంప్రదాయ పద్ధతిలో ఎద్దుల ద్వారా గానుగ ఆడించి నూనెను తయారు చేయడం ప్రత్యేకతగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సహజసిద్ధమైన విధానంలో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని, ఇటువంటి సంప్రదాయ వృత్తులను ఆధునిక మార్కెటింగ్ విధానాలతో అనుసంధానం చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సూచించారు.

యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంతాల్లో యువత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సహజ ఉత్పత్తుల తయారీ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే సహజ ఉత్పత్తులకు నాణ్యత, విశ్వసనీయతను కాపాడుతూ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్మా నారాయణ రెడ్డి ,తాంసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కౌడల సంతోష్, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, సంబంధిత అధికారులు, గ్రామస్థులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.