manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 11:54 pm Editor : manabharath

యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ: కలెక్టర్

ఆధునిక సాంకేతికతతో సాగు ఖర్చు తగ్గించి అధిక లాభాలు పొందాలి

మన భారత్, సెప్టెంబర్11, తలమడుగు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు, మెరుగైన లాభాలు సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం పల్సి (కె) గ్రామంలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు.

రైతు ఘన్శ్యామ్‌కు చెందిన పత్తి చేనులో డ్రోన్‌ ద్వారా పురుగుమందుల పిచికారీ చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు పిచికారీ చేయడం, కూలీల కొరతను అధిగమించడం, సాగు వ్యయాన్ని తగ్గించడం వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను కూడా పరిశీలించి, పంటల వివరాలను సాంకేతికత ఆధారంగా నమోదు చేయడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

గ్రామానికి చేరుకున్న కలెక్టర్ రాజర్షి షాకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్, విఠలేశ్వర ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీకృత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు ఫాంపాండ్లు, పశువుల షెడ్లు, వర్మీ కంపోస్ట్ వంటి వనరులను వినియోగించుకొని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఉన్న ఫాంపాండ్లను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పల్సి (కె) గ్రామ ప్రజలు కోరుతున్న బస్సు సౌకర్యం, పల్సి (కె)-తండా రోడ్డు మంజూరు, డోర్లి రోడ్డు సమస్యతో పాటు పంచాయతీ భవనం తదితర సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ..

వ్యవసాయ రంగంలో డ్రోన్ సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు డ్రోన్ పైలట్ శిక్షణ అందించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.లక్ష మార్జిన్ మనీతో రుణ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు.

పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత కోసం స్టడీ సర్కిల్ ద్వారా 200 మందికి ఉచిత శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంత యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఎల్‌డీఎం ఉత్బల్ కుమార్, సెంటిసులు రామగోపాల్ వర్మ, సర్పంచ్ నైతం చిను, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్ గ్రామస్థులు, యువత, పెద్దలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.