manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 11:39 pm Editor : manabharath

వైభవంగా పొలాల పండగ ఉత్సవాలు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పొలాల పండగ ఉత్సవాలను ప్రజలు సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించారు. వ్యవసాయానికి, పశుసంపదకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే ఈ పండగను గ్రామీణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

పొలాల పండగ సందర్భంగా ఉదయం నుంచే గ్రామాల్లో పండగ సందడి నెలకొంది. ప్రజలు ఉపవాస దీక్ష పాటించి తమ ఇళ్ల వద్ద ఉన్న బసవయ్యలను శుభ్రంగా కడిగి, అందంగా అలంకరించారు. అనంతరం బసవయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం గ్రామస్తులు అలంకరించిన బసవన్నలను హనుమాన్‌ ఆలయం చుట్టూ ఊరేగింపుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ బసవన్నలకు పూజలు చేయడం ఈ పండగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గ్రామాల్లో సంప్రదాయాలు, ఆచారాలను కొనసాగిస్తూ యువత సైతం ఉత్సాహంగా పాల్గొనడంతో పొలాల పండగ వేడుకలు మరింత సందడిగా మారాయి. పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలుగు రాజన్నతో పాటు గ్రామస్తులు, యువత, పెద్దలు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.