manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 2:24 pm Editor : manabharath

విద్యుత్ అందక రైతుల ఆందోళన.. పురుగు మందు డబ్బాలతో నిరసన

తలమడుగులో విద్యుత్ కోసం రైతుల ఆందోళన.. పురుగు మందు డబ్బాలతో నిరసన

తలమడుగు:మన భారత్, సెప్టెంబర్ 7,
పంట పొలాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ తలమడుగు మండల కేంద్రంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పలువురు రైతులు పురుగు మందు డబ్బాలు చేతబట్టి నిరసన తెలిపారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయని రైతులు తెలిపారు. దీంతో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సాగు పనులకు అధిక వ్యయం అవుతుండగా, విద్యుత్ సమస్య మరింత ఆందోళనకు గురిచేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరదలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించి, పంట పొలాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరిగితే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ నిరసన కొనసాగించారు.ఈ కార్యక్రమంలో రైతులు వెంకట్ రెడ్డి, కాంత్ రెడ్డి,ప్రేమేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,వినాయక్ రెడ్డి, రాంరెడ్డి ,తిరుపతి రావు, తదితర రైతులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.