manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 10:47 pm Editor : manabharath

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు టోకరా

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు టోకరా: నిందితుడిపై తలమడుగు పీఎస్‌లో కేసు నమోదు

ఆదిలాబాద్ జిల్లా (మన భారత్ – తలమడుగు): సెప్టెంబర్ 3,
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ నిరుద్యోగ యువకుడి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన కర్నేవార్ ప్రేమ్ (26) చదువు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలో భరంపూర్ గ్రామానికి చెందిన ఎం.డి. రఫీక్ అలియాస్ మహ్మద్ రఫీక్ (42) అనే వ్యక్తి బాధితుడికి పరిచయమయ్యాడు. తనకు ఉన్న పట్టుతో ఆర్‌అండ్‌బీ (R&B) శాఖలో లేదా కలెక్టరేట్‌లోని సెక్షన్-4లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నిందితుడి మాటలను నిజమని నమ్మిన బాధితుడు ప్రేమ్.. గత మే నెలలో (08-05-2026) తన నివాసం వద్ద రఫీక్‌కు రూ.2 లక్షల నగదును అందజేశాడు.
డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు ఉద్యోగం ఇప్పిస్తానంటూ సుమారు ఐదు నెలల పాటు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత బాధితుడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ప్రేమ్.. నిందితుడి ఇంటి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తలమడుగు పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 177/2026, సెక్షన్ 316(5), 318(4) BNS కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రహీం పాషా పేర్కొన్నారు. ఎస్సై డి. రాధిక నేతృత్వంలో కేసు దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు ఆశిస్తే నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.