manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 10:56 pm Editor : manabharath

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి..

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లకు అనుమతి లేదు

పెద్ద శబ్దాలతో డీజేలకు అనుమతులు లేవు.. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మన భారత్ సెప్టెంబర్ 1: తెలంగాణలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గణపతి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ తానిషా గార్డెన్‌లో గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1,000 మంది గణపతి మండపాల ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు హాజరయ్యారు. తొలుత వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి స్తోత్ర పారాయణంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ ప్రమాదాల నివారణ, నిమజ్జన ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీసు అధికారులు నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

సంప్రదాయాలు కాపాడుతూ ఉత్సవాలు నిర్వహించాలి

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. భక్తి, సమైక్యత, సోదరభావాన్ని చాటేలా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగను జరుపుకోవాలని సూచించారు.

గణపతి మండపాల నిర్వాహకులకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రతి మండపానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి

త్వరలో అందుబాటులోకి వచ్చే ఆన్‌లైన్ లింక్ ద్వారా ప్రతి గణపతి మండపాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మండపాల వివరాలు ముందుగానే పోలీసు శాఖకు అందుబాటులో ఉంటే బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు.

గ్రామాల్లో సాధ్యమైనంత వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఒకే గణపతి మండపం ఏర్పాటు చేసుకునేలా ప్రయత్నించాలని సూచించారు. గతంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, కొత్తగా మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

గణపతి మండపాల వద్ద భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విగ్రహంతో పాటు కనీసం ముగ్గురు వాలంటీర్లు 24 గంటలు మండపం వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జంతువులు, కోతులు మండపాల వద్దకు రాకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల ఏర్పాటు కోసం ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు.

నాణ్యమైన వస్తువులతో మండపాలు నిర్మించాలి

మండపాల నిర్మాణంలో మన్నికైన, నాణ్యమైన వస్తువులను మాత్రమే వినియోగించాలని పోలీసులు సూచించారు. ప్రజల రద్దీ, వర్షం, బలమైన గాలులు తదితర పరిస్థితుల్లో మండపం కూలిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండపాల పైభాగంలో వర్షపు నీరు నిలవకుండా నీరు కిందకు సులభంగా జారిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

విద్యుత్ శాఖ అధికారుల నుంచి విద్యుత్ సరఫరా, భద్రతకు సంబంధించిన సూచనలు తీసుకోవాలని, లైట్లు, విద్యుత్ కనెక్షన్ల కోసం నాణ్యమైన వైర్లు, పరికరాలు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.

రోడ్లకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయొద్దు

ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లు, ప్రధాన మార్గాల్లో మండపాలను ఏర్పాటు చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేసేవారు సంబంధిత స్థల యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లకు అనుమతి లేదు

శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా పెద్ద శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లు, సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదని సూచించారు.

మండపాల పేరుతో లక్కీ డ్రాలు నిర్వహించడం, జూదం ఆడించడం, బలవంతంగా చందాలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. మండపాల వద్దకు ఎవరూ మద్యం సేవించి రాకుండా నిర్వాహకులు పర్యవేక్షించాలని, అక్కడ టపాసులు కాల్చరాదని సూచించారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రతి గణపతి మండపం వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేందుకు అవసరమైన నీరు, ఇసుక తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

యువత గణపతి దీక్షలో పాల్గొనాలి

యువత గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఉత్సవాల పేరుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దు

సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చే అసత్య సమాచారం, వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా పోలీసు శాఖ సూచించింది. అనుమానాస్పద సమాచారం లేదా సమస్యాత్మక పోస్టులు కనిపించినప్పుడు వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 112 కు సమాచారం అందించాలని సూచించారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను అందరూ భక్తిశ్రద్ధలతో, సమైక్యంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

కరపత్రం ఆవిష్కరణ

గణపతి మండపాల నిర్వాహక కమిటీలు పాటించాల్సిన భద్రతా చర్యలు, నియమ నిబంధనలతో రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులకు పోలీసు శాఖ సూచనలు అందజేశారు.

ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, బీడీ ప్రేమ్ కుమార్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు జి. శ్రావణ్, సీహెచ్. రమేష్, కె. నరేష్, ఎం. ప్రసాద్, డి. గురుస్వామి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎన్. చంద్రశేఖర్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు బొంపల్లి హనుమన్లు, నూతన అధ్యక్షుడు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు, గణపతి మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి