manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 2:20 am Editor : Editor Vishal Kumar

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి..

గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు

ఆదిలాబాద్, ఆగస్టు 31: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు పోలీసు శాఖ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మొత్తం 23 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓర్పుగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల బాధ్యత

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

వివిధ సమస్యలపై ఫిర్యాదులు

గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుదారులు పలు రకాల సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కేసులకు సంబంధించిన వివరాలు, ఫోర్జరీ తదితర అంశాలపై ప్రజలు తమ ఫిర్యాదులను అందజేశారు.

ప్రతి సమస్యను సంబంధిత విభాగాలకు పంపించి, నిబంధనల ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలి

జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజలకు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు.

ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరిస్తే జిల్లాలో నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.