manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 11:43 pm Editor : manabharath

టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ..

రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఇచ్చోడ నుంచి రఘుగూడా వరకు భారీ బైక్ ర్యాలీ

కొమరం భీమ్‌కు నివాళులు.. రాఖీలు కట్టి ఆత్మీయత చాటిన గ్రామ ఆడపడుచులు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరిక

ఇచ్చోడ మండలం, ఆగస్టు 29: తెలంగాణ రక్షణ సేన (TRS) బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చోడ నుంచి సత్‌నంబర్ (రఘుగూడా) గ్రామం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో బైక్‌లపై ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీకి స్థానికంగా మంచి స్పందన లభించింది.

రఘుగూడా గ్రామానికి చేరుకున్న అనంతరం రాథోడ్ బాపురావు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమరం భీమ్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

రాఖీలు కట్టి సోదరభావం చాటిన ఆడపడుచులు

బైక్ ర్యాలీ రఘుగూడా గ్రామానికి చేరుకోగానే గ్రామస్థులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు రాథోడ్ బాపురావుకు ఘన స్వాగతం పలికారు. డోలి చప్పుళ్లు, నృత్యాలతో గ్రామంలో సందడి నెలకొంది. గ్రామ ఆడపడుచులు రాథోడ్ బాపురావుకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటారు. అనంతరం గ్రామస్థులు ఆయనను శాలువాతో సన్మానించారు.

గ్రామ సమస్యలపై స్పందించిన రాథోడ్ బాపురావు

ఈ సందర్భంగా రఘుగూడా గ్రామస్థులు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను రాథోడ్ బాపురావు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థులు వివరించిన సమస్యలను ఆయన శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు.

తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు గ్రామ పటేల్‌లు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. రాథోడ్ బాపురావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని వారు పార్టీలో చేరారు.

గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువత, మహిళలు పార్టీకి మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ రక్షణ సేనలో చేరడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పార్టీకి మరింత బలం చేకూరేలా కార్యకర్తలు పనిచేస్తారని నాయకులు తెలిపారు.

గ్రామస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ప్రజల విశ్వాసాన్ని పొందేలా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ భిలాల్ బాయ్, మండల నాయకులు, గ్రామ పెద్దలు, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.