manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 10:36 pm Editor : manabharath

కళాశాలల ఫలితాలపై ప్రత్యేక మానిటరింగ్ కమిటీ..

 మన భారత్, ఆగస్టు,25 ఆదిలాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా అకడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, బోధన, సిలబస్‌ పూర్తి, విద్యార్థుల ప్రగతి వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు తరగతులకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరై ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు.

తరగతులకు నిరంతరం హాజరుకావడం ద్వారా సబ్జెక్టులపై పూర్తి స్థాయిలో అవగాహన, పట్టు సాధించవచ్చని కలెక్టర్ అన్నారు. పాఠ్యాంశాలను క్రమపద్ధతిలో చదువుతూ సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగితే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు సాధించే విజయాలు వారి తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా వారు చదువుతున్న కళాశాలకు, ఆదిలాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకువస్తాయని పేర్కొన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందేలా అకడమిక్ మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

విద్యార్థులు అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రమాణాల పెంపునకు అధికారులు, అధ్యాపకులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి