నాగుల పంచమి సందర్భంగా కెస్లాపూర్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు
మన భారత్,ఆగస్టు 17, ఆదిలాబాద్: నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్‌లోని సుప్రసిద్ధ ఆదివాసీ దైవ క్షేత్రం నాగోబా ఆలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సోమవారం సందర్శించారు. పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తుల రాక పెరగడంతో పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా చర్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
కెస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీతో పాటు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయాలు, పూజా కార్యక్రమాలను అనుసరించి నాగోబా స్వామివారిని దర్శించుకున్నారు.
నాగుల పంచమి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతాలు తదితర అంశాలను పరిశీలించారు.
అనంతరం బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ మాట్లాడి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భక్తులు పూర్తిగా ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోయే వరకు బందోబస్తు సిబ్బంది అప్రమత్తంగా విధుల్లో కొనసాగాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎలాంటి పోలీసు సహాయం అవసరమైనా ప్రజలు డయల్ 100 లేదా 112 కు సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పర్వదినాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టేలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, పర్వదిన నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్న, ఎస్ఐ విక్రమ్‌తో పాటు పోలీసు సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
