manabharath.com
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 11:51 pm Editor : manabharath

అంతరపంటగా గంజాయి సాగు.!

పత్తి పొలంలో అంతరపంటగా గంజాయి సాగు..

8 మొక్కలు స్వాధీనం

బేల మండలం పిట్గావ్ శివారులో తనిఖీలు చేపట్టిన పోలీసులు..

నిందితుడు అరెస్టు, కేసు నమోదు

ఆదిలాబాద్ మన భారత్, ఆగస్టు 08:

బేల మండలం పిట్గావ్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఘటనను పోలీసులు వెలికితీశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ సీఐ జి. శ్రావణ్ ఆధ్వర్యంలో బేల ఎస్‌ఐ వై. మధుకృష్ణ, పోలీసు సిబ్బంది కలిసి పంట పొలంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో పత్తి పంటలో అంతరపంటగా సాగు చేస్తున్న 8 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి బేల మండలం పిట్గావ్ గ్రామానికి చెందిన నిందితుడు రాథోడ్ రంగ్‌రావు (55), భీమ్‌రావు కుమారుడు గా గుర్తించారు.

కేసు నమోదు.. నిందితుడి అరెస్టు, రిమాండ్

అక్రమంగా గంజాయి సాగు చేసినందుకు నిందితుడిపై బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాలు, వినియోగం వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత, రైతులు ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.

ప్రజలు సమాచారం ఇవ్వాలి

గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, గ్రామ పెద్దలు, రైతులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి సాగులో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకుండా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

ఈ తనిఖీల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది గ్రామ శివారు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ సాగును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి