manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 2:16 pm Editor : manabharath

తెలియని లింకులతో జాగ్రత్త: ఎస్పీ

ఏపీకే ఫైల్స్‌, తెలియని లింకులతో జాగ్రత్త: ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఈ వారం 38 ఫిర్యాదులు నమోదు

ఆర్థిక మోసం జరిగిన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి

మన భారత్, ఆదిలాబాద్: సైబర్ నేరగాళ్ల మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర ఆన్‌లైన్ వేదికల ద్వారా వస్తున్న తెలియని లింకులు, ఏపీకే (APK) ఫైల్స్‌ను ఓపెన్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం చేయవద్దని హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మొబైల్ ఫోన్, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి బ్యాంకు ఖాతాల్లోని నగదు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిని అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా లోన్ ఫ్రాడ్, ఏపీకే ఫ్రాడ్, ఫేక్ లింక్ మోసాలు, బిజినెస్ ఫ్రాడ్, వర్క్ ఫ్రమ్ హోం జాబ్ ఫ్రాడ్, హనీ ట్రాప్ వంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీకే ఫైల్స్‌తో అప్రమత్తం

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం, తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉందన్నారు.

సోషల్ మీడియా ప్రకటనలతో మోసాలు

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటన నిజమైనదని నమ్మవద్దని ఎస్పీ సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, ఇంటి నుంచే భారీ ఆదాయం, ఆన్‌లైన్ ఉద్యోగాలు, రుణాలు, వ్యాపార అవకాశాలు అంటూ వచ్చే ప్రకటనల విషయంలో ముందుగా పూర్తి వివరాలను పరిశీలించాలని తెలిపారు.

నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రమ్ హోం, డేటా ఎంట్రీ, పెన్సిల్ ప్యాకింగ్ తదితర ఉద్యోగాల పేరుతో మొదట చిన్న మొత్తంలో డబ్బులు చెల్లించాలని చెప్పి, ఆ తర్వాత వివిధ కారణాలతో పలుమార్లు నగదు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగం కోసం ఎవరైనా ముందుగా డబ్బులు అడిగితే జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఖాకీ కిడ్స్‌తో అవగాహన కార్యక్రమాలు

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఖాకీ కిడ్స్ కార్యక్రమం ద్వారా పోలీసు సిబ్బంది గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ తెలిపారు. విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

 38 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం సైబర్ క్రైమ్ విభాగంలో 38 ఫిర్యాదులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమకు ఎదురైన సైబర్ మోసాలను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఆర్థిక మోసం జరిగిన వెంటనే స్పందించడం అత్యంత కీలకమని, ముఖ్యంగా మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే పోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో నమోదైన కొన్ని సైబర్ మోసాలు

ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు: ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ, అసభ్యకర సందేశాలతో వేధింపులకు పాల్పడిన ఘటన నమోదైంది.

వర్క్ ఫ్రమ్ హోం మోసం: పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.4,150 మోసం చేసిన ఘటన ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా: బేలా పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, ఆమె పరిచయస్తులతో చాటింగ్ చేస్తూ కుటుంబ వివాదాలకు కారణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

లోన్ ప్రాసెసింగ్ ఫీజు మోసం: లోన్ మంజూరైందని నమ్మించి పలు దఫాలుగా రూ.35,315 వసూలు చేసిన ఘటన ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

అనధికారిక బ్యాంకు లావాదేవీ: ఎలాంటి లింక్, కాల్ లేదా సందేశం రాకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.20,000 బదిలీ అయిన ఘటన బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

క్రెడిట్ కార్డు ఓటీపీ మోసం: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉద్యోగిగా పరిచయం చేసుకుని ఓటీపీ తీసుకుని రూ.74,446 కాజేసిన ఘటన ఆదిలాబాద్ వన్‌టౌన్ పరిధిలో నమోదైంది.

వాట్సాప్ నగదు మోసం: నగదు చెల్లిస్తే అధిక మొత్తంలో తిరిగి ఇస్తామని నమ్మించి రూ.1,999 మోసం చేసిన ఘటన ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

నకిలీ లోన్ కాల్స్: తాము తీసుకోని లోన్ బకాయి ఉందంటూ పదేపదే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3,499 నష్టం జరిగిన ఘటన మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

డేటా ఎంట్రీ ఉద్యోగ మోసం: ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో పని చేయించి, పెనాల్టీ పేరుతో రూ.5,000 చెల్లించాలంటూ బెదిరించిన ఘటన ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి

సైబర్ నేరానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లోని సైబర్ వారియర్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

తెలియని లింకులపై క్లిక్ చేయకపోవడం, ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడం, ఓటీపీలు ఎవరికీ చెప్పకపోవడం, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోకపోవడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..