manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 6:09 pm Editor : manabharath

తెలంగాణ సిద్ధాంతకర్త సేవలు చిరస్మరణీయం: ఇన్‌చార్జ్ హెచ్ఎం విజయ

జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహణ

మన భారత్ | జాజాపూర్

తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ డాక్టర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ అందించిన సిద్ధాంత బలం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ప్రాంతీయ అసమానతలపై జీవితాంతం అధ్యయనం చేసి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.

ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రతి దశలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని ఆమె వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధోబలాన్ని అందించడంతో పాటు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన గొప్ప ఆలోచనాపరుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో కూడా కీలక సలహాదారుగా, మార్గదర్శిగా వ్యవహరించి ఉద్యమానికి బలమైన పునాది వేశారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ ఆయన పలు గ్రంథాలు రచించి ప్రజల్లో చైతన్యం కల్పించారని, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గట్టిగా వినిపించారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఆకాంక్షతో చివరి వరకు కృషి చేసినప్పటికీ, రాష్ట్ర ఏర్పాటు జరగక ముందే 2011 జూన్ 21న ఆయన కన్నుమూశారని గుర్తు చేశారు.

ఆచార్య జయశంకర్ ఆశయాలు, విలువలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని, విద్యార్థులు ఆయన జీవితం నుంచి క్రమశిక్షణ, నిబద్ధత, సమాజ సేవ వంటి గొప్ప విలువలను నేర్చుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు విజయ సూచించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన కలలు కన్న సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంగళ, హెచ్. భాను ప్రకాష్, లక్ష్మణ్, మధుసూదన్, శిరీష, శశిరేఖ, ప్రతాప్, నరసింహ, నరసింహులు, నిర్మల, శ్రీదేవి, రఘురాం రెడ్డి, సంగీతతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి మీ విశాల్ కుమార్ చీఫ్ ఎడిటర్ హైదరాబాద్