భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరమైతేనే బయటకు రావాలి.. ప్రజలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన
జలపాతాలు, వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.. 24/7 అందుబాటులో DDRF బృందం
వరద నీటితో ప్రవహించే కల్వర్టులు, బ్రిడ్జిలను దాటొద్దని హెచ్చరిక
ఆదిలాబాద్, జూలై 30 (మన భారత్, ఆదిలాబాద్): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరదలు, వర్షాల కారణంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. రాష్ట్ర వాతావరణ శాఖ భారీ వర్షాల సూచనల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా వరద పరిస్థితులు ఏర్పడితే తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
24/7 అందుబాటులో DDRF బృందం
ప్రజలకు అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు నూతనంగా అందజేసిన అత్యాధునిక పరికరాలతో కూడిన డిడిఆర్ఎఫ్ (DDRF) బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. వరదలు, నీటి ప్రవాహాలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే డయల్ 100 కు లేదా సమీపంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తత
భారీ వర్షాల సమయంలో వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలపాతాల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా బ్రిడ్జిలు, కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
నీటి ప్రవాహం తక్కువగా కనిపించినప్పటికీ వాహనాలతో బ్రిడ్జిలు, కల్వర్టులు దాటడం ప్రమాదకరమని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాహసం చేయవద్దని తెలిపారు.
జలపాతాల వద్ద యువత అత్యుత్సాహం వద్దు
భారీ వర్షాల సమయంలో జలపాతాలు, వాగులు, నదులు, కాలువలు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు యువత అత్యుత్సాహంతో వెళ్లకూడదని ఎస్పీ సూచించారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా మారే అవకాశం ఉన్నందున సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దని హెచ్చరించారు.
మత్స్యకారులు, ప్రజలు కూడా భారీ వర్షాల సమయంలో జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రైతులు విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి
భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు పొలాల్లోని విద్యుత్ మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తడిగా ఉన్న పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను చేతులతో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్‌కు సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తితే స్వయంగా పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
పాత భవనాలు, చెట్ల కింద ఉండొద్దు
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, పాడైన పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల సమీపంలో ఉండకూడదని పోలీసులు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు పాత భవనాల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రమాదకర ప్రాంతాలను పోలీసుల పర్యవేక్షణ
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని జలపాతాలు, చెరువులు, కుంటలు, అలుగులు, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను పోలీసులు ముందుగానే తెలుసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి ప్రజల రాకపోకలను పర్యవేక్షించాలని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల రాకపోకలను నియంత్రించాలని అధికారులకు సూచించారు.
వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి
భారీ వర్షాల సమయంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వర్షం కారణంగా రహదారులపై గుంతలు ఏర్పడటం, నీటితో అవి కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. వరద నీరు ప్రవహించే రోడ్లపై వేగంగా వాహనాలు నడపకుండా, పరిస్థితులను గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలను పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అనవసరంగా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సహకరించాలని కోరారు.
అత్యవసర సమయంలో డయల్ 100కు లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసు శాఖ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
