మన భారత్ | తలమడుగు
రుయ్యాడి గ్రామంలో నూతన తపాలా కార్యాలయం ప్రారంభం.. గ్రామపంచాయతీ భవనంలో సేవలు ప్రారంభం
తలమడుగు, జూలై 28 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రజలకు మరింత మెరుగైన తపాలా సేవలు అందించేందుకు గ్రామపంచాయతీ భవనంలో నూతన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. జిల్లా అధికారి ఐపీఓ రాజు స్థానిక సర్పంచ్ ఉడుగు రాకేష్ తో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించి సేవలను ప్రారంభించారు.
గత కొన్ని సంవత్సరాలుగా రుయ్యాడి గ్రామ తపాలా కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండగా, గ్రామ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక గదిని కేటాయించి పోస్ట్ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులకు తపాలా, పొదుపు పథకాలు, మనీ ఆర్డర్లు, పోస్టల్ బ్యాంకింగ్ తదితర సేవలు ఒకేచోట మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ సహకారంతో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్, వార్డు సభ్యులు రజిత అశోక్, విజయ ఉత్తమ్, రమాకాంత్, డీటీ ప్రభాకర్, రమేష్ (ఎంఓ), గ్రామ కార్యదర్శి రాములు, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, సంజీవరెడ్డి, గంగాధర్, టి. రంగారెడ్డి, ఎల్. ప్రవీణ్ రెడ్డి, జె. నర్సింగ్, సతీష్ రెడ్డి, బీపీఎం ఇమ్రాన్ ఖాన్, పోతన్న తో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామంలో ప్రభుత్వ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా పోస్ట్ ఆఫీస్‌ను గ్రామపంచాయతీ భవనానికి మార్చడం స్థానికులకు ప్రయోజనకరంగా మారుతుందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
