వాహన దొంగల ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
7 బైక్‌లు, 3 ఆటోలు, కారు సహా రూ.17 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం
16 మందిపై కేసు.. ఆరుగురు పరారీ – నేరడిగొండ పోలీసుల ఘన విజయం
ఆదిలాబాద్, మన భారత్ జూలై 26: జిల్లాలో వాహన దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్‌జిల్లా వాహన దొంగల ముఠా గుట్టును నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులపై కేసు నమోదు చేయగా, 10 మందిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు.
ఆదివారం పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. గత కొద్ది నెలలుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠాను నేరడిగొండ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.
రిమ్స్ ఎదుట ఆటో చోరీకి యత్నం
ఈ నెల 21న ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఆటోను చోరీ చేసేందుకు ముఠా సభ్యులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో జూలై 24న రాత్రి కుప్టి ఘాట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, కారులో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి ఒకరు కత్తితో పోలీసులను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పోలీసులను నెట్టివేసి కారులో పరారైనట్లు వివరించారు.
అనంతరం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జూలై 25న వాంకిడి చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద కారును ఆపి అందులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వాహన దొంగతనాల ముఠా గుట్టు బయటపడినట్లు ఎస్పీ తెలిపారు.
డ్రైవర్లుగా తిరుగుతూ టార్గెట్ల గుర్తింపు
ముఠాలోని ప్రధాన నిందితులు యాసర్ అహ్మద్, మహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహైల్ డ్రైవర్లుగా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరిగేవారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం అందించేవారని చెప్పారు.
అనంతరం ముఠా సభ్యులు అద్దె కారును తీసుకుని, ముందుగా గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి పార్క్ చేసిన వాహనాలను చోరీ చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఈ విధంగా చోరీ చేసిన వాహనాలను ముఠాలోని రిసీవర్లుగా వ్యవహరిస్తున్న ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహాలకు విక్రయించేవారని తెలిపారు.
భారీగా చోరీ వాహనాల స్వాధీనం
అరెస్టైన 10 మంది నిందితుల నుంచి పోలీసులు 7 మోటార్‌సైకిళ్లు, 3 ఆటోలు, ఒక కారు, ఒక కత్తి, 8 మొబైల్ ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 7 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.17 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
ముఠాలోని మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
వాహనదారులకు ఎస్పీ కీలక సూచనలు
ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని ఎస్పీ సూచించారు. వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచాలని కోరారు. ప్రతి ఇంటి, వ్యాపార సంస్థ, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టేందుకు సహకరించాలని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా, వాహన చోరీలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.
అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినా, నంబర్ ప్లేట్లను మార్చినా లేదా ట్యాంపరింగ్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా సరైన నంబర్ ప్లేట్‌తో వాహనాలను నడపాలని సూచించారు.
అరెస్టైన నిందితులు..
యాసర్ అహ్మద్, అక్బర్ ఖాన్, ఉమర్ ఖాన్, అబ్దుల్ ఫారూక్, అర్బాస్ ఖాన్, మహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహైల్, నాసిర్ బిన్ జావీద్, ఆజామ్ ఖాన్, షేక్ ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న నిందితులు
ఇమ్రాన్, జైన్, జునైద్, సోఫియాన్, ఫర్దీన్, అద్నాన్ అలియాస్ అయాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఐపీఎస్, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్‌ఐ సయ్యద్ ఇమ్రాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
