manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:17 am Editor : manabharath

విగ్రహ దాతకు ఘన సన్మానం..

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

పల్లి (బి) గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

తలమడుగు,మన భారత్ జూలై 26: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి (బి) గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం ద్వారా తన హక్కులను పొందుతున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరులు తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని సూచించారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని రాథోడ్ బాపురావు కొనియాడారు. విద్య, సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, వాటిని జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

విగ్రహదాతకు ఘన సన్మానం

పల్లి (బి) గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు నిధులు సమకూర్చి సహకరించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్ల సుభాష్ రెడ్డి, నిమ్మళవర్ గజానంద్, గడుగు పోచన్న, రమేష్, శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.