manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 4:39 pm Editor : manabharath

బ్యాంకు నుంచి బయటికొచ్చారా.. ఇక దొంగల కన్ను మీ పైనే

బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారే టార్గెట్‌.. అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్‌లో స్కూటీ డిక్కీ పగులగొట్టి రూ.3 లక్షల నగదు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

నిందితుడి నుంచి రూ.1.80 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం

ఆదిలాబాద్,మన భారత్ జూలై 25: బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తులను రహస్యంగా వెంబడించి, వారు వాహనాలను పార్క్ చేసి వెళ్లగానే స్కూటీ డిక్కీలు, కార్ల అద్దాలు పగులగొట్టి నగదు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహాలో పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ముఠాపై ఇప్పటివరకు 22 కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణంలో గత నెల ఐడీబీఐ బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించిన నిందితులు.. నేతాజీ చౌక్ సమీపంలోని మసీదు వద్ద పార్క్ చేసిన ఆక్టివా స్కూటీ డిక్కీని పగులగొట్టి రూ.3 లక్షల నగదును అపహరించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడు శంకర్ @ శంకరప్పను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1,80,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకుల వద్దే రెక్కీ.. వాహనాలు పార్క్ చేసిన వెంటనే చోరీ

జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలను వెల్లడించారు. శంకర్ తన సహచరులతో కలిసి అంతరాష్ట్ర స్థాయిలో ముఠాగా ఏర్పడి బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకునేవారని తెలిపారు. ముందుగా బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించి, నగదు డ్రా చేసిన వ్యక్తులను రహస్యంగా వెంబడించేవారని చెప్పారు.

బాధితులు స్కూటీ లేదా కారును పార్క్ చేసి కొద్దిసేపు దూరంగా వెళ్లిన సమయంలో.. వాహనాల డిక్కీలు లేదా కార్ల అద్దాలను పగులగొట్టి నగదును అపహరించడం ఈ ముఠా నేర పద్ధతిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.

చంద్రపూర్‌లో బైక్ చోరీ.. అనంతరం ఆదిలాబాద్‌లో రూ.3 లక్షల దోపిడీ

విచారణలో నిందితుడు శంకర్ తన సహచరులు షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయిలతో కలిసి కర్ణాటకలోని భద్రావతి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లి చోరీలకు పాల్పడినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

2026 జూన్ 22న భద్రావతి నుంచి నాగ్‌పూర్ మీదుగా చంద్రపూర్‌కు చేరుకున్న ముఠా అక్కడ ఒక మోటార్‌సైకిల్‌ను దొంగిలించినట్లు విచారణలో తేలింది. అనంతరం చంద్రపూర్ పట్టణంలో ఒక కార్ అద్దాలను పగులగొట్టి బ్యాగ్‌లో ఉన్న రూ.25 వేల నగదును అపహరించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

తర్వాత ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్న నిందితులు ఐడీబీఐ బ్యాంక్ వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించారు. నేతాజీ చౌక్ సమీపంలోని మసీదు వద్ద ఆ వ్యక్తి తన ఆక్టివా స్కూటీని పార్క్ చేసి వెళ్లిన సమయంలో డిక్కీని పగులగొట్టి రూ.3 లక్షల నగదును అపహరించి పరారయ్యారు. ఈ నగదులో తన వాటాగా మిగిలిన రూ.1.80 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పలు రాష్ట్రాల్లో 22 కేసులు

దర్యాప్తులో నిందితుడు తెలంగాణలోని హైదరాబాద్‌లో చార్మినార్, లుంబినీ పార్క్, జేబీఎస్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు వరంగల్, నిజామాబాద్, బైంసా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, మహారాష్ట్రలోని చంద్రపూర్, ఔరంగాబాద్, నాసిక్, పండరకవాడ, కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, రాయచూర్ తదితర ప్రాంతాల్లోనూ బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించి స్కూటీ డిక్కీలు, కార్ల అద్దాలు పగులగొట్టి లక్షల రూపాయల నగదును దోచుకున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

చోరీ చేసిన నగదును ముఠా సభ్యులు సమానంగా పంచుకుని, వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేసేవారని వెల్లడించారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు

ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అంతరాష్ట్ర స్థాయిలో నమోదైన ఇతర కేసులకు సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.

ప్రజలకు పోలీసుల కీలక సూచనలు

బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసిన అనంతరం నగదును వాహనాల డిక్కీలలో లేదా కార్లలో ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లవద్దని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు తమను వెంబడిస్తున్నట్లు అనుమానం కలిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు.

అరెస్ట్ అయిన నిందితుడు

శంకర్ @ శంకరప్ప (43), తండ్రి లక్ష్మణ్, వృత్తి: హమాలి, నివాసం: 4వ ఎన్‌ఎంసీ రైట్ సైడ్, కువెంపు నగర్, హోసమనే, భద్రావతి, శివమొగ్గ జిల్లా, కర్ణాటక.

పరారీలో ఉన్న నిందితులు

* షేకర్ – ఆదిలాబాద్ కేసులో నిందితుడు

* శ్రీనివాస్ – ఇతర కేసుల్లో నిందితుడు

* సంజీవ్ – ఇతర కేసుల్లో నిందితుడు

* సాయి – ఇతర కేసుల్లో నిందితుడు

స్వాధీనం చేసుకున్న ఆస్తి

* రూ.1,80,000 నగదు

* ఒక సెల్‌ఫోన్

కేసును ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు నగదును రికవరీ చేసిన దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి. సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, సంజయ్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది రమేష్, త్రిశూల్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి..

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..