manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 2:47 pm Editor : manabharath

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్:

దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ నాయకుడు పడాల రవీందర్ మాధవ్ డిమాండ్ చేశారు. 1947 నుంచి ఇప్పటి వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రశ్నపత్రాల లీక్‌లు, ఉద్యోగ నియామకాలలో అవకతవకల ఆరోపణలు, సంబంధిత వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రశ్నపత్రాల లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన ప్రజాప్రతినిధులు, అధికారులు లేదా ఇతర బాధ్యులెవరైనా చట్టం ముందు సమానమేనని, వారి హోదాతో సంబంధం లేకుండా నిష్పాక్షిక విచారణ జరగాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం రాజీనామాలతో వ్యవహారాన్ని ముగించకుండా, దర్యాప్తులో బాధ్యత నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రవీందర్ మాధవ్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత పటిష్టంగా మార్చేందుకు కేంద్రం ప్రత్యేక విధానాలు రూపొందించాలని సూచించారు.

అదేవిధంగా దేశ భద్రత, జాతీయ సమగ్రతకు సంబంధించిన నేరాల విషయంలో కూడా మరింత బలమైన చట్టాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు పరీక్షల నిర్వహణలో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు అమలు చేయడం, అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు సమర్థమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.