ధనోర (బి), మన భారత్ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం
గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఎస్పీ అఖిల్ మహాజన్
గ్రామ భద్రతకు సీసీటీవీ కెమెరాలు కీలకం.. 20 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ
ఇంద్రవెల్లి, జూలై 24: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం, గ్రామాల్లో పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న పోలీసులు మీకోసం’ కార్యక్రమం శుక్రవారం ఇంద్రవెల్లి మండలం ధనోర (బి) గ్రామంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీతో పాటు ఉట్నూర్ ఏఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని తెలిపారు. నేరాలు జరిగిన సందర్భాల్లో నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో సీసీటీవీ ఫుటేజీ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సాగు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా సంబంధిత శాఖలకు సిఫారసు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా, మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే గంజాయికి బానిసైన విద్యార్థులకు డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సహకరించాలని కోరారు.
రోడ్డు భద్రతపై అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా 20 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఎస్పీ సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.
ధనోర (బి) గ్రామంలో నిర్వహించిన రెండు రోజుల మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఎస్పీ నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. ప్రథమ బహుమతి: మల్లాపూర్ గ్రామ జట్టు – రూ.5,000 నగదు బహుమతి, ట్రోఫీ
ద్వితీయ బహుమతి: కేస్లాపూర్ జట్టు – రూ.3,000 నగదు బహుమతి, ట్రోఫీ
అలాగే పాఠశాల విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్లను అందజేశారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పీఈటీలు, నిర్వాహకులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
గ్రామంలో జూదం, అక్రమ మద్యం, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా గ్రామ పెద్దలు, యువత పోలీసులతో కలిసి పనిచేయాలని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఎస్ఐ ఈ. సాయన్న, సర్పంచ్ జాదవ్ జమున నాయక్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువతతో పాటు సుమారు 250 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి .
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
