manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 11:28 pm Editor : manabharath

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు

మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రధాన ఏజెంట్‌తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని ఇంద్రవెల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ. సాయన్న తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి మండలం లాల్టేకిడి హీరాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుకేంద్ర విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా వాల్గొండకు చెందిన జయదేవ్ మాన్ పవర్ కన్సల్టెన్సీ ఏజెంట్ అనుపురపు శ్రీనివాస్ గౌడ్‌ను సంప్రదించాడు. ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.4.30 లక్షలు ఖర్చవుతుందని ఏజెంట్ శ్రీనివాస్ గౌడ్ బాధితుడికి తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

అదే సమయంలో నిందితుడు ఇస్లావత్ ప్రభాకర్ కూడా బాధితుడికి ఏజెంట్‌పై పూర్తి నమ్మకం కలిగించేలా మాట్లాడి ప్రోత్సహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను నమ్మిన బాధితుడు విడతలవారీగా శ్రీనివాస్ గౌడ్‌కు రూ.4.32 లక్షలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న అనంతరం ప్రతిసారి ఏదో ఒక కారణంతో బాధితుడిని తిప్పుతూ వచ్చారని పోలీసులు పేర్కొన్నారు.

అంతేకాకుండా విదేశాలకు వెళ్లేందుకు అదనపు ఖర్చులు అవుతాయని చెబుతూ బాధితుడి నుంచి విడతలవారీగా మరింత డబ్బు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా మొత్తం రూ.6,51,800 వసూలు చేసి బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బాధితుడిని రెండుసార్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లినప్పటికీ సరైన పత్రాలు లేకపోవడంతో తిరిగి వెనక్కి పంపించారని తెలిపారు. దీంతో బాధితుడు నిందితులను నిలదీయగా, పెద్దల సమక్షంలో రూ.6.40 లక్షలు తిరిగి ఇస్తానని అంగీకరించినప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని పోలీసులు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బాధితుడు ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ ఈ. సాయన్న ఆధ్వర్యంలోని పోలీసు బృందం దర్యాప్తు చేసి నిందితులు అనుపురపు శ్రీనివాస్ గౌడ్ (45), ఇస్లావత్ ప్రభాకర్‌లను అరెస్టు చేసింది. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

నకిలీ ఏజెంట్లను నమ్మవద్దు

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే నకిలీ ఏజెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంద్రవెల్లి పోలీసులు సూచించారు. విదేశీ ఉద్యోగాల పేరుతో ఎవరైనా భారీ మొత్తంలో డబ్బులు అడిగితే, ఏజెంట్ వివరాలు, సంస్థ అనుమతులు, ఉద్యోగ ఆఫర్, వీసా తదితర పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా వ్యవహరించే ఏజెంట్లపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.