manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 6:20 am Editor : manabharath

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ 

వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి

ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం, ప్రజల రక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు నీటి వినియోగంలో పొదుపు పద్ధతులు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళికలను రూపొందించేందుకు అధికారులు సహకరించాలని తెలిపారు.

అధిక నీటి అవసరం ఉన్న పంటల స్థానంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ప్రత్యేక అధికారి సూచించారు. ముఖ్యంగా కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పంటలు తక్కువ నీటితో మంచి దిగుబడిని అందించే అవకాశముందని, రైతుల ఆదాయాన్ని కూడా స్థిరంగా ఉంచడంలో దోహదపడతాయని వివరించారు.

ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలని ఆయన సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల ఎంపిక, నీటి నిర్వహణ, పంట సంరక్షణ అంశాలపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు.

రైతులు కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..