manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:22 pm Editor : manabharath

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ

మన భారత్, ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కిసాన్ చౌక్ వరకు రహదారి డివైడర్లపై పెద్దఎత్తున చెత్త పేరుకుపోయిందని సామాజిక కార్యకర్త ప్రేమకళ ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ చెత్త కారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో పాటు ప్రయాణికులు, ముఖ్యంగా మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై చెత్తను సకాలంలో తొలగించకపోవడం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. డివైడర్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార అవశేషాలు, ఇతర చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు.

వర్షాలు కురుస్తున్న సమయంలో ఇలాంటి చెత్త నిల్వలు దోమలు, ఈగలు పెరిగేందుకు అనుకూలంగా మారి డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉందని ప్రేమకళ తెలిపారు. అలాగే ఆహారం కోసం తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర మూగజీవాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆమె హెచ్చరించారు.

నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంబేద్కర్ చౌక్ నుంచి కిసాన్ చౌక్ వరకు ఉన్న డివైడర్లపై పేరుకుపోయిన చెత్తను అత్యవసరంగా తొలగించాలని స్థానిక మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని ఆమె కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదేనని ఆమె అన్నారు.

అధికారులు వెంటనే స్పందించి చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.