manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 2:48 pm Editor : manabharath

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్

14 ద్విచక్ర వాహనాలు సీజ్

ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ఇచ్చోడ సర్కిల్ పరిధిలోని సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధి చిమన్‌గూడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తృత తనిఖీలు చేపట్టి గుడుంబా తయారీ, అక్రమ మద్యం విక్రయాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ సిహెచ్ రమేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ద్వారా పోలీసులు నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలను కొనసాగిస్తున్నారు.

కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో నలుగురు వ్యక్తుల వద్ద నుంచి 10 లీటర్ల గుడుంబా,50 లీటర్ల గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం ఊట,3 క్వింటాళ్ల ఇప్పపూలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అలాగే గ్రామంలోని ఓ బెల్ట్ షాపుపై దాడి నిర్వహించి 3.5 లీటర్ల అక్రమ మద్యాన్ని* స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా 35 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు అమర్చడం, వాహనాల పత్రాలు లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో 14 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా సీఐ సిహెచ్ రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో గుడుంబా తయారీ, అక్రమ మద్యం విక్రయం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు విక్రమ్, ఎల్. శ్రీకాంత్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ ఆర్సీ ఇన్చార్జి..

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..