manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 1:45 pm Editor : manabharath

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం

పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం మరింత సులభం కానుంది

మన భారత్:‌ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించేందుకు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కు సవరణ తీసుకురావాలని ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర స్థానిక పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సి వస్తోంది. అనంతరం గ్రామాల్లో అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టాలన్నా లేదా అవసరమైన ఖర్చులకు నిధులు వినియోగించాలన్నా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి రావడంతో ఆలస్యం జరుగుతోంది. దీంతో అనేక గ్రామాల్లో చిన్నచిన్న అభివృద్ధి పనులు కూడా సకాలంలో పూర్తి కావడం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో పంచాయతీలకు నిధుల వినియోగంలో మరింత స్వేచ్ఛ కల్పించేలా ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమవుతోంది. సవరణ అమల్లోకి వస్తే గ్రామ పంచాయతీలు తమకు లభించే ఆదాయాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, ఇతర అత్యవసర పనులను త్వరితగతిన చేపట్టేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

గ్రామీణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా గ్రామ పంచాయతీల సామర్థ్యం పెరిగి, అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా సాగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాత సంబంధిత చట్ట సవరణ ప్రక్రియ పూర్తి చేసి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పనితీరులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..