manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 7:19 pm Editor : manabharath

తులం బంగారం ఇంకా ఎప్పుడు ఇస్తారో.!

భీంపూర్‌లో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మీ పథకం ఎంతో తోడ్పడిందన్న ఎమ్మెల్యే – కాంగ్రెస్ హామీలపై విమర్శలు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున కళ్యాణ లక్ష్మీ ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఒక మహిళ తన పసిబిడ్డతో కలిసి వచ్చి కళ్యాణ లక్ష్మీ చెక్కును స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెక్కుల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రారంభమైన కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిందని అన్నారు. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందాయని పేర్కొన్నారు.

అలాగే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెళ్లి జరిగిన రోజే కళ్యాణ లక్ష్మీ చెక్కును అందజేస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం ఆలస్యంగా చెక్కులు అందుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన తులం బంగారం హామీని కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మండల నాయకులు కేమ శ్రీకాంత్, అప్రోజ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.