manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 3:00 pm Editor : manabharath

FRS హాజరు నమోదుపై షోకాజ్ నోటీసులను ఉపసంహరించాలి: PRTU-TG 

FRS హాజరు నమోదుపై షోకాజ్ నోటీసులను ఉపసంహరించాలి: PRTU-TG

సాంకేతిక లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘం అభిప్రాయం

మన భారత్, ఆదిలాబాద్:

ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా విద్యార్థుల హాజరు నమోదు శాతం తక్కువగా నమోదైందనే కారణంతో ప్రధానోపాధ్యాయులు (HMలు), మండల విద్యాధికారులకు (MEOలు) షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని PRTU-TG ఆదిలాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్ సంయుక్తంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ప్రకటనలో వారు మాట్లాడుతూ, విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియ పూర్తిగా FRS ఆధారిత సాంకేతిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. నెట్‌వర్క్ అంతరాయాలు, సర్వర్ సమస్యలు, మొబైల్ యాప్‌లో తలెత్తే సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నిషన్ గుర్తింపు సమస్యలు వంటి కారణాలతో హాజరు నమోదు శాతం తగ్గి కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవ హాజరు 80 శాతానికి పైగానే ఉన్నప్పటికీ, కేవలం ఒక రోజు నమోదైన FRS డేటాను మాత్రమే ప్రమాణంగా తీసుకుని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

ఒక్కరోజు నమోదైన హాజరు శాతాన్ని ఆధారంగా చేసుకుని అధికారులపై చర్యలు ప్రారంభించడం వల్ల మండల విద్యాశాఖ అధికారుల్లో, పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో అనవసర ఆందోళన నెలకొంటుందని తెలిపారు. సమస్యల మూలాలను గుర్తించి పరిష్కరించాల్సిన సమయంలో సాంకేతిక లోపాలను పక్కనబెట్టి బాధ్యతను అధికారులపై మోపడం సరైన పరిపాలనా విధానం కాదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే FRS వ్యవస్థలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని PRTU-TG ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.

విద్యా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, సాంకేతిక లోపాల కారణంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను బాధ్యులను చేయకుండా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంఘం విజ్ఞప్తి చేసింది.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

ఆదిలాబాద్ జిల్లాలో మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.