మన భారత్, తలమడుగు
ఝరిలో ఇండ్ల ముందర ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు.. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి
వర్షాకాలంలో విద్యుత్ తీగలతో ప్రాణాలకు ముప్పు.. వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతి
తలమడుగు, జూలై 14 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో ఇండ్ల ముందుగా ప్రమాదకరంగా విద్యుత్ సరఫరా వైర్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ తీగలు మరింత ప్రమాదకరంగా మారాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో జీవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని పలు వీధుల్లో విద్యుత్ వైర్లు చాలా తక్కువ ఎత్తులో ఇండ్ల ముందు నుంచి వెళ్లడం వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాల సమయంలో తీగలు ఊగిపోవడం, విద్యుత్ స్తంభాల పరిస్థితి బలహీనంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను వెంటనే పరిశీలించి, అవసరమైన చోట కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు వైర్లను సురక్షిత ఎత్తుకు మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా, ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సమస్యను గ్రామ సర్పంచ్ మెస్రం రూపతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత విద్యుత్ అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
గ్రామంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లాలో మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
