manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 12:56 am Editor : manabharath

సర్పంచ్ ఇల్లే గ్రామపంచాయతీ..!

మన భారత్, తలమడుగు

తలమడుగు, జూలై 13 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన సమగ్ర ఓటరు సర్వే (SIR) కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో గ్రామ సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ తన ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా గ్రామ ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు ఎస్‌ఐఆర్ (SIR) ఫారాలను ప్రజలకు అందించి, వాటిని నింపించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ మాట్లాడుతూ, రత్నాపూర్ గ్రామం ఇప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా గ్రామ పంచాయతీ భవనం లేకపోవడంతో అధికారిక సమావేశాలు, గ్రామ సభలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సరైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామంలో అంగన్‌వాడీ భవనం కూడా లేకపోవడం వల్ల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందాల్సిన సేవలు కూడా ఇబ్బందులతో సాగుతున్నాయని తెలిపారు. ప్రతి నెల నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేయడానికి కూడా తగిన వసతి లేకపోవడం బాధాకరమన్నారు.

గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రత్నాపూర్ గ్రామానికి శాశ్వత గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి ఆమోదం తెలపడంతో పాటు రహదారి సమస్యను కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

ఆదిలాబాద్ జిల్లాలో మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..