బాల్యంలోనే చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలి..
అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, ఆదిలాబాద్:
బాల్యం నుంచే చదువుపై ఆసక్తిని పెంపొందించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తేనే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. గురువారం గాదిగూడ మండలంలోని లోకారి గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులు, ఆదివాసీ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎస్పీ, చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, లైబ్రరీలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యంతో, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో విజయాలను సాధించవచ్చని చెప్పారు.
విద్యార్థులు కేవలం పరీక్షల్లో మార్కులకే పరిమితం కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువుతో పాటు ఉద్యోగాలు, వ్యాపారం, వ్యవసాయం, పోటీ పరీక్షలు వంటి వివిధ రంగాలపై ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన మార్గదర్శకత్వం అందించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని పేర్కొన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్పీ
పాఠశాల సందర్శన అనంతరం జిల్లా ఎస్పీ విద్యార్థులతో కలిసి సామూహిక భోజనంలో పాల్గొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనం రుచి, నాణ్యత, మెనూ తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు, ఉన్నత విద్యపై అభిరుచులను తెలుసుకుని ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు.
క్రీడలతో మేధస్సు వికాసం
విద్యార్థుల్లో మేధో వికాసం, ఆలోచనా శక్తి పెంపొందించేందుకు చెస్ బోర్డులు, బిజినెస్ గేమ్స్‌తో పాటు పలు క్రీడా సామగ్రిని జిల్లా ఎస్పీ అందజేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అధికారులు, ఆదివాసీ నాయకుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, ఐపీఎస్ , నార్నూర్ సీఐ అంజమ్మ, గాదిగూడ ఎస్సై రమ్య, ఆదివాసీ నాయకులు దౌలత్‌రావు తుడసం, అమృతరావు, దుర్గు పటేల్, ఉపాధ్యాయుడు శేఖర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
