manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:21 pm Editor : manabharath

ఘనంగా.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

మన భారత్ | ఆదిలాబాద్ | 07

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహణ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దండోరా జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 18 మంది యువకులతో ప్రారంభమైన దండోరా ఉద్యమం సామాజిక న్యాయం సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దశాబ్దాల పాటు ఉద్యమం కొనసాగిందని పేర్కొన్నారు.

ఈ ఉద్యమంలో అనేక ఆటుపోట్లు, జైలు నిర్బంధాలు, తప్పుడు కేసులు, ప్రభుత్వాల అణచివేత చర్యలను ఎదుర్కొంటూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిరంతర పోరాటం సాగి, చివరకు ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ విజయాన్ని యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఎమ్మార్పీఎస్ కేవలం వర్గీకరణ ఉద్యమానికే పరిమితం కాకుండా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆరోగ్యశ్రీ పథకం అమలు, ఆసరా పెన్షన్ల విస్తరణ, రేషన్ బియ్యం పెంపు, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ, మహిళలపై దాడుల నివారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి పలు సామాజిక అంశాలపై కూడా కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడైనా దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరిగినప్పుడు స్పందించే సామాజిక బాధ్యత కలిగిన ఉద్యమంగా ఎమ్మార్పీఎస్ నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక ఉద్యమంతో పాటు రాజకీయంగా కూడా బలోపేతమై ప్రజల హక్కుల సాధన కోసం మరింత సమర్థంగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇండ్ల ఎల్లన్న మాదిగ, మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు గుర్రాల ఆశన్న, ఆరేపల్లి గణేష్, కడదారపు పోచన్న, పెద్దింటి సూర్యప్రసాద్, మేకల జితేందర్, వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నాందేవ్ విలాస్, రాచర్ల శరత్, సుద్దాల భాస్కర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..