manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:09 pm Editor : manabharath

11 కేసులు ఛేదించిన పోలీసులు..

మన భారత్, ఆదిలాబాద్

ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఆదిలాబాద్ పోలీసులు

ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన బంగారు వ్యాపారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దస్నాపూర్‌కు చెందిన కొలాయం కాశీనాథ్ (19) జల్సాలకు అలవాటు పడి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా నిందితుడు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఆపేందుకు ప్రయత్నించగా పరారయ్యేందుకు యత్నించాడు. పోలీసులు వెంటాడి పట్టుకుని విచారించగా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితుడు మొత్తం 11 చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. వీటిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, మావల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి నుంచి జూలై నెలల మధ్య ఆదిలాబాద్ పట్టణం, భీంపూర్, తలమడుగు ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో హుండీ నగదు, వెండి కళ్లు, వెండి నామాలు, వెండి చేతులు, వెండి విగ్రహాలు, బంగారు పుస్తెలు, బంగారు గుండ్లు, ఇత్తడి గంటలు, హారతి పళ్లాలు తదితర విలువైన వస్తువులను అపహరించినట్లు విచారణలో బయటపడింది.

చోరీ చేసిన బంగారం, వెండి వస్తువులను ఆదిలాబాద్ అశోక్ రోడ్డులోని బంగారు వ్యాపారి లోకాజీ విశ్వనాథ్‌కు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ సొత్తు అని తెలిసినా కొనుగోలు చేసినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి సుమారు 30 తులాల వెండి ఆభరణాలు, 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు వెండి కళ్లు, ఒక వెండి నామం, హోండా షైన్ మోటార్ సైకిల్ (TG 01 1828), రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,150 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయాలు, ప్రార్థనా స్థలాల్లో చోరీలకు పాల్పడే నేరస్తులతో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసే వారిపైనా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కేసు ఛేదనలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై ప్రణయ్, పోలీసు సిబ్బంది భూపతి, నరేష్, క్రాంతి, కిషన్‌తో పాటు సీసీఎస్ బృందం కీలక పాత్ర పోషించారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..