మన భారత్ | ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో అక్రమంగా చిన్న ఎడ్ల తరలింపు భగ్నం..
– 9 చిన్న ఎడ్లు, వాహనం స్వాధీనం
ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): ఆదిలాబాద్ పట్టణంలో అక్రమంగా చిన్న ఎడ్లను వధశాలలకు తరలిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహన తనిఖీల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 9 చిన్న ఎడ్లు, 5 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టూ టౌన్ సీఐ కె. నాగరాజు తెలిపారు.
జిల్లాలో జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా జంతువులను తరలించడం, వధించడం, మాంసం అక్రమ వ్యాపారం నిర్వహించడం వంటి కార్యకలాపాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా గత రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 9 చిన్న ఎడ్లను తాళ్లతో కట్టి అమానుషంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసులు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా 5 కిలోల మాంసం కూడా లభ్యమైంది. వెంటనే జంతువులను రక్షించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసుల విచారణలో నిందితుల వద్ద జంతువుల రవాణాకు అవసరమైన ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకపోవడంతో పాటు వెటర్నరీ వైద్యుడి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం, కొనుగోలు పత్రాలు కూడా లేవని వెల్లడైంది. దీంతో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్వాధీనం చేసుకున్న 9 చిన్న ఎడ్లను గోశాలకు తరలించి సంరక్షణకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వివరాలు
అబ్దుల్ జహీర్ (29), ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
అబ్దుల్ నజీర్ (40), ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
అబ్దుల్ రఫీక్ (29), ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
అబ్దుల్ బషీర్ అలియాస్ బషీర్ ఖురేషి (32), ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
సీఐ హెచ్చరిక
జంతువులను అక్రమంగా రవాణా చేయడం, చట్టవిరుద్ధంగా వధించడం, మాంసం అక్రమ వ్యాపారం నిర్వహించడం వంటి చర్యలను జిల్లా పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని టూ టౌన్ సీఐ కె. నాగరాజు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
