ఆదిలాబాద్‌లో మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం..
రోడ్డు రోలర్‌తో 121 సైలెన్సర్ల ధ్వంసం
మన భారత్, ఆదిలాబాద్ | జూలై 6
ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గత నెల రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు మొత్తం 121 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ చౌరస్తా వద్ద స్వాధీనం చేసుకున్న ఈ సైలెన్సర్లను జిల్లా ఎస్పీ సమక్షంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ చర్య ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లైంది.
పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వాహనాలకు కంపెనీ ప్రమాణాలకు విరుద్ధంగా అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి, వాటి స్థానంలో కంపెనీ అందించిన అసలు సైలెన్సర్లను అమర్చిన అనంతరం వాహనాలను యజమానులకు అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, అధిక శబ్దం చేసే సైలెన్సర్ల వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాల్లో ఇలాంటి శబ్ద కాలుష్యం ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తోందన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇదే తరహా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మోడిఫైడ్ సైలెన్సర్లు, పటాకా శబ్దాలు వచ్చేలా మార్పులు చేసిన వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా, వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చే మెకానిక్‌లు కూడా చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ఎవరైనా ఇలాంటి మార్పులు చేయాలని కోరితే వాటిని అమర్చకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీస్ సైరన్‌ను అనుమతి లేకుండా వినియోగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. మోడిఫైడ్ సైలెన్సర్లు లేదా అనధికారికంగా పోలీస్ సైరన్ వినియోగిస్తున్న వాహనాలను గుర్తించిన ప్రజలు ఫోటోలు లేదా వివరాలను ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ 8712659922 నంబర్‌కు పంపించాలని కోరారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ఆదిలాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి. సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, ఎస్‌ఐలు దేవేందర్, ప్రణయ్ కుమార్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
