manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:20 am Editor : manabharath

కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్..

TRS పార్టీ పేరు మార్చాలని ఆదేశం

15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలి..

లేకపోతే పార్టీ నమోదు దరఖాస్తు క్లోజ్ చేస్తామని స్పష్టం

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న TRS పార్టీ పేరుపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పేరును మార్చాలని సూచిస్తూ కవితకు అధికారికంగా లేఖ పంపింది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సూచించాలని, లేనిపక్షంలో ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఎన్నికల సంఘానికి పార్టీ నమోదు కోసం దరఖాస్తు అందిన అనంతరం, ప్రతిపాదిత TRS పేరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా BRS సహా మరికొన్ని రాజకీయ పార్టీలు ఈ పేరుపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే రాజకీయ రంగంలో ఈ పేరుకు సంబంధించి గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని, ఓటర్లలో అయోమయం కలిగించే పరిస్థితులు తలెత్తవచ్చని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిశీలించింది.

ఈ క్రమంలో పార్టీ పేరును యథాతథంగా ఆమోదించడం సాధ్యం కాదని పేర్కొంటూ, కొత్త పేర్లను ప్రతిపాదించాలని ఎన్నికల సంఘం సూచించింది. 15 రోజుల గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని, నిర్ణీత గడువులో స్పందించకపోతే పార్టీ నమోదు ప్రక్రియను నిలిపివేసి దరఖాస్తును క్లోజ్ చేస్తామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవితకు ఇది కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆమె ఎన్నికల సంఘం సూచన మేరకు కొత్త పేర్లను ప్రతిపాదిస్తారా? లేక చట్టపరంగా ముందుకు వెళ్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే నమోదైన పార్టీల పేర్లు, ఎన్నికల గుర్తులను పోలి ఉండే పేర్లకు అనుమతి ఇవ్వడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటర్లలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది.

కల్వకుంట్ల కవిత తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘానికి ఆమె సమర్పించే ప్రత్యామ్నాయ పేర్లు ఏవన్నదానిపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..