manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 10:43 pm Editor : manabharath

వర్షాకాలంలో అప్రమత్తతే రక్షణ..

డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాపై ప్రజలకు అవగాహన కల్పించిన డా. హరీష్

తలమడుగులో వైద్యశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

– ప్రతి శుక్రవారం ‘పొడి దినం’ పాటించాలని సూచన

మన భారత్ | తలమడుగు:

వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. హరీష్ సూచించారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే నీరు దోమల పెరుగుదలకు ప్రధాన కారణమవుతుందని, ప్రతి కుటుంబం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్టీ (టైగర్) దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని వివరించారు. ఈ దోమలు ప్రధానంగా పగటి సమయంలో కుడతాయని, నిల్వ ఉన్న పరిశుభ్రమైన నీటిలో గుడ్లు పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

డెంగ్యూ లక్షణాలు ఇవే..

* ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం

* భరించలేని తలనొప్పి

* కంటి వెనుక భాగంలో నొప్పి

* కండరాలు, కీళ్ల నొప్పులు

* వాంతులు, వికారం

* తీవ్రమైన అలసట

* కొందరిలో చర్మంపై దద్దుర్లు

* తీవ్రమైన కేసుల్లో చిగుళ్ల నుంచి లేదా ఇతర భాగాల నుంచి రక్తస్రావం

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ముఖ్యంగా పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ పాత్రలు, నీటి డ్రమ్‌లు, సిమెంట్ తొట్టెలు, కూలర్లు, మూతలులేని నీటి ట్యాంకులను తరచుగా శుభ్రం చేయాలి. వారానికి కనీసం ఒకసారి వాటిలోని నీటిని పూర్తిగా తొలగించి ఆరబెట్టాలని సూచించారు.

పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమతెరలు వినియోగించడం, దోమల నివారణ క్రీములు లేదా రిపెలెంట్లు ఉపయోగించడం ద్వారా దోమకాట్లను నివారించవచ్చన్నారు.

ప్రతి శుక్రవారం ‘పొడి దినం’

ప్రజల భాగస్వామ్యంతో దోమల నివారణకు “శుక్రవారం పొడి దినం” కార్యక్రమాన్ని పాటించాలని వైద్యశాఖ పిలుపునిచ్చింది. ప్రతి శుక్రవారం ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా దోమల లార్వా దశలోనే నిర్మూలించవచ్చని వివరించారు.

చికిత్సపై సూచనలు

డెంగ్యూ వైరస్‌కు ప్రత్యేక చికిత్స లేదని, అయితే సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడరాదని, జ్వరం తగ్గించేందుకు వైద్యుల సూచన మేరకు మాత్రమే పారాసిటమాల్ వినియోగించాలని సూచించారు. జ్వరం వచ్చిన తొలి రోజే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని వివరించారు.

ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి

జ్వరం తగ్గిన తర్వాత కూడా తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాంతుల్లో రక్తం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక అలసట వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం

మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులకు అవసరమైన పరీక్షలు, చికిత్స, మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ తెలిపింది.

వర్షాకాలంలో దోమల నివారణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం ద్వారా డెంగ్యూ వంటి వ్యాధులను సమర్థంగా అరికట్టవచ్చని వైద్యశాఖ పునరుద్ఘాటించింది. వర్షాకాలంలో దోమల పెరుగుదలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.