manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:21 pm Editor : manabharath

మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం

మన భారత్ | ఆదిలాబాద్

మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

జూన్‌లో 90 ఫిర్యాదుల పరిష్కారం.. 87 మంది ఆకతాయిలపై చర్యలు.. ఒక బాల్య వివాహాన్ని అడ్డుకున్న షీ టీం

ఆదిలాబాద్, జూలై 2 (మన భారత్): మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పోలీస్ అక్క, షీ టీం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, బాధితులకు తక్షణ న్యాయం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, మహిళల భద్రతకు సంబంధించిన ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్ అక్క, షీ టీం సిబ్బంది వారానికి కనీసం మూడు పాఠశాలలు, మూడు గ్రామాలను సందర్శించి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వారికి చట్టపరమైన అవగాహన కల్పించాలని సూచించారు.

జూన్ నెలలో షీ టీం పనితీరు విశేషం

జూన్ నెలలో జిల్లాలో షీ టీంకు మొత్తం 90 ఫిర్యాదులు అందగా, వాటిపై సత్వర చర్యలు తీసుకొని పరిష్కరించారు. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్న 87 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో 50 మందిపై పెట్టి కేసులు నమోదు చేయగా, 37 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అదనంగా రెండు ఈ-పెట్టి కేసులతో కలిపి మొత్తం 52 పెట్టి కేసులు, ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

షీ టీం చొరవతో ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని, సంబంధిత కుటుంబ సభ్యులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల హక్కులు, సైబర్ నేరాల నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాలికల భద్రత వంటి అంశాలపై జిల్లాలో 76 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

అలాగే 48 గ్రామాలను సందర్శించి మహిళలు, యువత, విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు 157 హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా కొనసాగించి, మహిళల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు.

వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలి

మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే డయల్-100 లేదా 8712659953 నంబర్ ద్వారా ఆదిలాబాద్ షీ టీంను సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఫిర్యాదును గోప్యంగా స్వీకరించి, బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సమావేశంలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు పోలీస్ అక్క, షీ టీం సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. మహిళలకు మరింత చేరువై, వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో షీ టీం సిబ్బంది, పోలీస్ అక్కలు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..