అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం..
ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రతిపాదనలు
అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపు
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధి, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, మున్సిపాలిటీ ఆదాయ వృద్ధి లక్ష్యంగా సర్వసభ్య సమావేశంలో పలు కీలక అజెండా అంశాలను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మున్సిపాలిటీని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు.
సర్వసభ్య సమావేశంలో మొత్తం ఏడు కీలక ప్రతిపాదనలను చర్చకు తీసుకొచ్చినట్లు ఆమె వివరించారు. పట్టణంలోని 49 వార్డుల్లో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించామని తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా పట్టణంలోని డివైడర్లు, ఓపెన్ స్థలాలు, ప్రభుత్వ భూములు, పార్కుల్లో పచ్చదనం పెంపొందించేందుకు గ్రీన్ బడ్జెట్ కింద రూ.55 లక్షలు కేటాయించే ప్రతిపాదనను సమావేశంలో ఉంచినట్లు చెప్పారు. పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పట్టణ వాతావరణం కల్పించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని వివరించారు.
మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న 49 పారిశుద్ధ్య, చెత్త సేకరణ వాహనాల మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. చెత్త సేకరణ వ్యవస్థ సమర్థవంతంగా కొనసాగేందుకు వాహనాల నిర్వహణ అత్యవసరమని పేర్కొన్నారు.
మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూర్చే ఉద్దేశంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 20 మున్సిపల్ భవనాలను బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇవ్వడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయం పెరిగి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత నిధులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
పట్టణంలోని 118 మంది వీధి వ్యాపారుల అద్దెను రూ.500 నుంచి రూ.1,000కు సవరించే ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుతూ ప్రజా సేవలను మరింత మెరుగుపర్చడమే దీని ఉద్దేశ్యమని వివరించారు.
అలాగే రూ.23 లక్షలతో టెండర్ అయిన తై బజార్‌కు ఆమోదం తెలుపుతూ, రైతు బజార్‌లోని కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు, మార్కెట్ యార్డుకు వచ్చే పత్తి రైతులు, వారి వాహనాలకు మినహాయింపులు కల్పించే ప్రతిపాదనను కూడా సమావేశంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు, చిన్న వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదనపు అజెండా కింద 49 వార్డులకు ప్రస్తుతం ఉన్న చెత్త సేకరణ వాహనాలు సరిపోకపోవడంతో కొత్త వాహనాల కొనుగోలు ప్రతిపాదనను కూడా సమావేశంలో ఉంచినట్లు చైర్‌పర్సన్ వెల్లడించారు.
అయితే, ఈ ప్రజా ప్రయోజన అంశాలను కొందరు బీజేపీ కౌన్సిలర్లు, మరికొందరు స్వతంత్ర కౌన్సిలర్లు వ్యతిరేకించారని బండారి అనూష సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “49 వార్డులకు చెత్త సేకరణ వాహనాల మరమ్మతులు అవసరం కాదా? ఇంకుడు గుంతల నిర్మాణం అవసరం లేదా? పట్టణంలో పచ్చదనం పెంచడం అవసరం లేదా? ఖాళీగా ఉన్న మున్సిపల్ భవనాలను అద్దెకు ఇచ్చి ఆదాయం పెంచడం తప్పా?” అంటూ ప్రశ్నించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, పరిశుభ్రమైన పట్టణాన్ని నిర్మించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని అమలు చేసేందుకు తమ బృందం కట్టుబడి ఉంటుందని తెలిపారు.
“ఆదిలాబాద్ అభివృద్ధే మా లక్ష్యం… ప్రజల సంక్షేమమే మా ధ్యేయం” అని పేర్కొంటూ, అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజాప్రతినిధులు సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ విజ్ఞప్తి చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
