manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:16 pm Editor : manabharath

హెల్మెట్ లేకుంటే ఆ ఊరిలోకి ‘నో ఎంట్రీ’..

హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ‘నో ఎంట్రీ’..

బట్టిసవర్గం గ్రామం వినూత్న నిర్ణయం

అరవై అలైవ్’కు సంపూర్ణ మద్దతు..

మద్యపాన, గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి గ్రామసభ తీర్మానం

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:

రోడ్డు ప్రమాదాల నివారణ, యువత ప్రాణాల రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘అరవై అలైవ్’ కార్యక్రమానికి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బట్టిసవర్గం గ్రామం విశేష మద్దతు ప్రకటించింది. గ్రామసభలో ఏకగ్రీవంగా కీలక తీర్మానాలు చేస్తూ, గ్రామాన్ని సురక్షితమైన, మత్తు పదార్థాలకు దూరమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సంకల్పించారు.

గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రోడ్డు భద్రతపై విస్తృతంగా చర్చించిన అనంతరం, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనంపై వచ్చే వారికి గ్రామంలోకి ప్రవేశం ఉండదని గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని గ్రామసభ సూచించింది.

ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా యువతలో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించాలని తీర్మానించారు. హెల్మెట్ వినియోగం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు గ్రామ సర్పంచ్ మెట్పల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళా ప్రతినిధులు జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి గ్రామసభ తీర్మాన ప్రతిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందజేశారు.

గ్రామంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి చర్యలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించారు. అలాగే గ్రామాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా,గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు తావులేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని గ్రామసభ సంకల్పించింది.

మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొంటూ, విద్యార్థులు, యువకుల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి కుటుంబం తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గ్రామ పెద్దలు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. బట్టిసవర్గం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని, రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు కూడా ఇది ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.

అరవై అలైవ్’ కార్యక్రమం లక్ష్యం కేవలం హెల్మెట్ ధరింపజేయడం మాత్రమే కాదని, ప్రతి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడడం, ప్రతి యువకుడి ప్రాణాన్ని రక్షించడమేనని ఎస్పీ తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఆయన సూచించారు.

సురక్షిత రహదారులు, మత్తు పదార్థాల రహిత సమాజం, బాధ్యతాయుతమైన యువతతోనే అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొంటూ, బట్టిసవర్గం గ్రామం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ అభినందించారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..