manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 6:44 pm Editor : manabharath

చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి..

మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్

మన భారత్, మొగుళ్ళపల్లి:

దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి ఆమె హాజరై, స్థానిక వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అశ్రద్ధ లేదా అపోహలకు లోను కాకుండా తమ పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఒకప్పుడు దేశాన్ని పట్టిపీడించిన పోలియోను కేవలం నిరంతర చుక్కల మందు పంపిణీ ద్వారానే నియంత్రించగలిగామని, ఆ పట్టుదలను ఇలాగే కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో విడతలోనూ ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ మళ్లీ చుక్కలు వేయించడం సురక్షితమని, ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని మరింత పటిష్టం చేస్తుందని ఆమె వివరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. మొగుళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి, ఒక్క రికార్డు కూడా మిస్ అవ్వకుండా వంద శాతం పోలియో చుక్కల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఎండలను, వానలను లెక్కచేయకుండా ప్రతి ఇంటికీ తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య సిబ్బంది సేవలను ఆమె కొనియాడారు. అలాగే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను ప్రయాణాల్లో ఉన్నవారు సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.