manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:32 pm Editor : manabharath

సోషల్ మీడియాలో పోస్ట్.. ఉప సర్పంచ్ అరెస్టు

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియో పోస్టు చేసిన సిరిచల్మ ఉపసర్పంచ్ అరెస్ట్

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తప్పవు : ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన ఘటనలో గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్ తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సిరిచల్మ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్ ఒక వీడియోను రూపొందించి తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేసినట్లు గుర్తించారు. ఆ వీడియో ద్వారా ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలు, అపోహలు వ్యాపించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు, వీడియోలు, సందేశాలు ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ప్రజల మధ్య శాంతి, సామరస్యాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఇతరులకు పంపించడం లేదా షేర్ చేయడం చేయవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూపుల్లో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే పోస్టులు, వీడియోలు కనిపిస్తే వెంటనే తొలగించాలని సూచించారు.

ఇలాంటి అభ్యంతరకరమైన పోస్టులను ఉద్దేశపూర్వకంగా కొనసాగించే వారు లేదా నిర్లక్ష్యం చేసే గ్రూప్ అడ్మిన్లపై కూడా అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

అనుమానాస్పద పోస్టులు, విద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే వీడియోలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.