manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 4:17 pm Editor : manabharath

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు:

రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు

ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని ప్రసిద్ధ హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయ్యాడి గ్రామాన్ని సందర్శించి హస్సేన్ హుస్సేన్ దైవాలను దర్శించుకున్నారు.

గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్న ఎస్పీని గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించారు. గ్రామ సమావేశ మందిరంలో గ్రామ చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై గ్రామస్తులతో ఎస్పీ చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. రుయ్యాడి గ్రామ ప్రజలు కుల, మత భేదాలు లేకుండా కలిసికట్టుగా పండుగలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఉండి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్ఐ డి. రాధిక, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.