manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 6:18 am Editor : manabharath

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..

కూరగాయల బుట్టలు ఖాళీగానే మిగిలాయి… ఇద్దరి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్, మావల ,మన భారత్:

ప్రతి రోజు మాదిరిగానే కుటుంబ పోషణ కోసం తెల్లవారుజామున ఇంటి నుంచి కూరగాయల బుట్టలు తీసుకుని బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు ఇక తిరిగి ఇంటి గడప దాటలేదు. జీవనోపాధి కోసం సాగిన ప్రయాణం మావల పార్క్ సమీపంలో విషాదాంతమైంది.

తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన ఆనంద్ (65), నారాయణ (46)తో పాటు మరో ఇద్దరు ఆటోలో కూరగాయలు అమ్మేందుకు ఆదిలాబాద్‌కు వెళ్తుండగా, వేగంగా వచ్చిన కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆనంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నారాయణ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

కుటుంబ సభ్యులకు ఈ విషాద వార్త అందగానే వారి రోదనలు హృదయాలను కలచివేశాయి. ఉదయం కూరగాయలు అమ్మి సాయంత్రానికి ఇంటికి వస్తారని ఎదురుచూసిన కుటుంబాలకు, వారి మృతదేహాలే చేరుకోవడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

రోజువారీ కూలి, చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవించే ఈ కుటుంబాలకు ఈ ప్రమాదం తీరని లోటును మిగిల్చింది. ఇంటికి అండగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే ఘటనలో మృతి చెందడంతో పల్లి (బి) గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని మృతులకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఘటనపై సమాచారం అందుకున్న మావల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఒక క్షణం నిర్లక్ష్యం… రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబాల కోసం బయలుదేరిన ప్రయాణం, వారి జీవితాలకు చివరి ప్రయాణంగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.