manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 2:54 am Editor : manabharath

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం..

మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది..

తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ వై. నారాయణ రెడ్డి

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటుతూ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడం, ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ వై. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. నాలుగు సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారిని తప్పనిసరిగా ప్రీ-ప్రైమరీ తరగతుల్లో చేర్పించి వారి విద్యాభ్యాసానికి బలమైన పునాది వేయాలని తల్లిదండ్రులకు సూచించారు.

అలాగే, మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని వివరించారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. చిన్న వయసులోనే విద్యపై ఆసక్తి పెంపొందితే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించగలరని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి అలుగంటి కిష్టమ్మ, వార్డు సభ్యులు అర్క సంటెన్న, శ్రీమతి మల్లారపు షీలా గోవింద్, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కొమ్ము జ్యోతి, అంగన్వాడీ టీచర్లు రాధా, అనసూయ, శోభా, ఉపాధ్యాయులు ఎలిజబెత్ రాణి, మీనాక్షి, శంకర్, సంతోషి, ప్రీ-ప్రైమరీ టీచర్ కుమారి అచ్చు నవీన, ఆయా అంబాడి శ్రీవాణి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విద్య, పర్యావరణ పరిరక్షణ అనే రెండు ముఖ్యమైన అంశాలను ఒకే వేదికపై చర్చిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో విశేష స్పందనను పొందింది. పిల్లల విద్యాభివృద్ధితో పాటు పర్యావరణ సంరక్షణలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..