manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:54 pm Editor : manabharath

సర్పంచ్ కృషితో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ

సర్పంచ్ కృషితో మొగుళ్లపల్లికి నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ

 ఎన్నో ఏళ్ల కల సాకారం.. మండల ప్రజల హర్షం

 ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో సాధ్యమైన బస్సు సౌకర్యం

మన భారత్, మొగుళ్లపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నైట్ హాల్ట్ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారం, ఆర్టీసీ అధికారుల సానుకూల స్పందనతో ఈ చిరకాల స్వప్నం సాకారమైంది.

మొగుళ్లపల్లి మండల ప్రజలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్య అవసరాలు తదితర కారణాలతో ప్రతిరోజూ వివిధ పట్టణాలకు ప్రయాణిస్తుంటారు. అయితే రాత్రి వేళల్లో సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా జమ్మికుంట రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు సమయానికి రవాణా లేక ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో అదనపు ఖర్చులతో పాటు అనేక ఇబ్బందులు పడేవారు.

ఈ సమస్యను గుర్తించిన మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ ప్రజల తరఫున పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ రాంప్రసాద్‌ను కలిసి సమస్యను వివరించారు. మండల ప్రజలకు నైట్ హాల్ట్ బస్సు అవసరాన్ని తెలియజేసి బస్సు సేవలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకున్న ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించి నైట్ హాల్ట్ బస్సు సేవలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

దీంతో జూన్ 15 నుంచి పరకాల బస్ స్టేషన్ నుండి ప్రతి రోజు రాత్రి 8.30 గంటలకు బయలుదేరే బస్సు మొగుళ్లపల్లికి రాత్రి 9 గంటలకు చేరుకుంటోంది. అలాగే మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు మొగుళ్లపల్లి నుండి బయలుదేరి జమ్మికుంటకు ఉదయం 5.15 గంటలకు చేరుకునే విధంగా సర్వీస్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సు సేవలను పునరుద్ధరించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. మండల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పారు.

నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణతో మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు సమయానికి జమ్మికుంట స్టేషన్‌కు చేరుకునే అవకాశం లభించనుంది.

ఈ బస్సు సేవలను పునఃప్రారంభించడంలో కృషి చేసిన సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆర్టీసీ అధికారులకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో సర్పంచ్ చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..